పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0205-06 దేవగాంధారి సం: 03-030 ఉపమానములు

పల్లవి:

ఎన్నఁడొకో నేఁ దెలిసి యెక్కుడయి బ్రదికేది
పన్నిన నా గుణమెల్లా భ్రమత పాలాయ

చ. 1:

ధనమద మిదె నన్ను దైవము నెఱగనీదు
తనుమద మెంతయిన తపముఁ జేయనీదు
ఘనసంసారమదము కలుషముఁ బాయనీదు
మనెడి నా మనువెల్ల మదము పాలాయ

చ. 2:

పొంచి కామాంధకారము పుణ్యము గానఁగనీదు
కంచపు జన్మపుచిక్కు గతి చూపదు
పెంచి యజ్ఞానతమము పెద్దల నెరఁగనీదు
చించరాని నా బుద్ధి చీఁకటి పాలాయ

చ. 3:

శ్రీవేంకటేశ్వరు మాయ చిత్తముఁ దేరనీదు
యేవంకా నీతఁడే గతి యిన్నిటా మాకు
యే వుపాయమును లేక యీతని మఱఁగు చొచ్చి
దేవుఁ డంతర్యామియని తేజముఁ బొందితిమి