పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0205-04 శ్రీరాగం సం: 03-028 శరణాగతి

పల్లవి:

ఇతనికంటె ఘను లిఁక లేరు
యితర దేవతల యిందరిలోన

చ. 1:

భూపతి యీతఁడె పొదిగి కొలువరో
శ్రీపతి యీతఁడే చేకొనరో
యేపున బలువుఁడు నీతఁడే చేరరో
పైపై వేంకటపతి యైనాఁడు

చ. 2:

మరుగురుఁడితఁడే మతి నమ్మఁగదరో
పరమాత్ముఁ డితఁడె భావించరో
కరివరదుఁ డితఁడె గతియని తలఁచరో
పరగ శ్రీవేంకటపతి యైనాఁడు

చ. 3:

తల్లియు నితఁడే తండ్రియు నితఁడే
వెల్లవిరై యిఁక విడువకురో
చల్లగా నితని శరణని బ్రతుకరో
అల్ల శ్రీవేంకటహరి యయినాఁడు