పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0240-05 దేసాళం సం: 03-231 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

విశ్వరూప నీ మూర్తి వివేకించలేను నేను
శాశ్వతుఁడ నీవున్నచందమేమీ నెఱఁగ

చ. 1:

నిబ్బరమై లోకమెల్లా నిండుక వుండుదువట
దొబ్బుకొంటాఁ దిరిగేము తోవల నిన్ను
వుబ్బి సముద్రమువలెనున్న నీ ప్రకృతియందు
గబ్బినై యీఁదుచున్నాఁడఁ గలఁగకుమీ

చ. 2:

కడయు మొదలులేని కాలము నీతనువట
నడుమ నందుతోనే పెనఁగుచున్నాఁడ
అడరి నీ సొమ్ములైన ఆత్మలలో నొకఁడనై
చిడుముడినున్నవాఁడ చిక్కువఱచకుమీ

చ. 3:

పరమున నిహమునఁ బ్రబలియున్నాఁడవట
గరిమ సోదించేము కమ్మటి నిన్ను
ఇరవై శ్రీవేంకటేశ నిన్నిటా నిన్ను నేము
శరణు చొచ్చితిమిఁక చనవిచ్చి కావుమీ