పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0240-03 ముఖారి సం: 03-229 శరణాగతి

పల్లవి:

జగములేలేవాఁడవు జనార్దనుఁడవు
తగ నీవారమై(మే?) నేము ధర నెట్టుండినాను

చ. 1:

గతి నీవు మతి నీవు కాణాచిచోటు నీవు
సతమై యన్నిటికిని సాక్షివి నీవు
చతురత వలసితే జరతుము కొలుతుము
తతి నేము సేసిన తప్పులు లోఁగొనవే

చ. 2:

తల్లియుఁ దండ్రివి నీవు దాత దైవమవు నీవు
యెల్ల వారికిఁ బరము నిహము నీవు
మల్లడి నొక్కొకవేళ మఱతుము తలఁతుము
చల్లఁగా మా నేరములు సైరించుకొనవే

చ. 3:

దరి నీవు దాపు నీవు దయామూర్తివి నీవు
పరగ శ్రీవేంకటేశ పతివి నీవు
విరివిగా నేమైనా వేఁడుదుము నుతింతుము
శరణు చొచ్చితిమిఁక క్షమియించుకొనవే