పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0201-01 మాళవి సం: 03-001 శరణాగతి

పల్లవి: ఇట్టి ప్రతాపము గల యీతని దాసుల నెల్ల
          కట్టునా కర్మములెల్ల గాలిఁ బోవుఁ గాక

చ. 1: యెలమిఁ జక్రాయుధున కెదురా దానవులు
        తొలఁగ కెందుచొచ్చినఁ దుండించుఁ గాక
        ఇల గరుడధ్వజు పై నెక్కునా విషములు
        కలఁగి నీరై పారి గాలిఁ బోవుఁ గాక

చ. 2: గోవర్ధనధరునిపై కొలుపునా మాయలు
         వేవేలు దునుకలై విరుగుఁగాక
         కేవలుఁ డచ్యుతనొద్దఁ గీడు చూపఁగలవా
         కావరమై తాఁ దానె గాలిఁ బోవుఁ గాక

చ. 3: వీరనారసింహునకు వెరపులు గలవా
         దూరాన గగ్గులకాడై తొలఁగుఁ గాక
         కోరి యీ శ్రీవేంకటేశుఁ గొలిచితి మిదివో
         కారుకొన్న పగలెల్ల గాలిఁ బోవుఁ గాక