పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0231-01 ధన్నాసి సం: 03-174 అధ్యాత్మ

పల్లవి:

వెఱ్ఱి దెలిసి రోఁకలి వెసఁ జుట్టుకొన్నట్టు
యిఱ్ఱి దీముభోగముల నెనసేము

చ. 1:

మురికిదేహము మోచి మూలల సిగ్గుపడక
పొరిఁ బరిమళములు పూసేము
పరగ పునుకతల పావనము సేసేమంటా
నిరతితోడ దినము నీట ముంచేము

చ. 2:

పుక్కట పంచేంద్రియపు పుట్టు వుట్టి యందరిలో
మొక్కించుక దొరలమై మురిసేము
అక్కర నజ్ఞానమనే అంధకారమున నుండి
దిక్కుల నెదిరివారిఁ దెలిపేము

చ. 3:

దినసంసారమే మాకు దేవుఁడని కొలుచుక
వెనుకొని ఘనముక్తి వెదకేము
యెనలేక శ్రీవేంకటేశ మమ్ముఁ గావఁగాను
తనిసి తొల్లిటిపాటు దలఁచేము