పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0316-05 పాడి సం: 04-094 భగవద్గీత కీర్తనలు


పల్లవి :

పుట్టుభోగులము నేము భువి హరి దాసులము
నట్ట నడమి దొరలు నాకియ్యవలెనా


చ. 1:

పల్లకీలు నందలాలు పడివాగెతేజీలు
వెల్లవిరి మహలక్ష్మివిలాసములు
తల్లి యాకె మనినే దైవమని కొలిచేము
వొల్లఁగే మాకేసిరులు వొరు లియ్యవలెనా


చ. 2:

గ్రామములు రత్నములు గజముఖ్యవస్తువులు
ఆమని భూకాంతకు నంగభేదాలు
భామిని యాకెమగని ప్రాణధారి లెంకలము
వోమి మాకాతఁడే యిచ్చీ వొరులియ్యవలెనా


చ. 3:

పసగల పదవులు బ్రహ్మనిర్మితములు
వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుఁడు
యెసఁగి యాతఁడే మమ్ము నేలి ఇన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా