పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0316-02 లలిత సం: 04-091 అధ్యాత్మ


పల్లవి :

తలఁపులోని వెలితే దైవము వెలితౌ
కలిగిన ఇదియే కారణము


చ. 1:

యెదిటీ యాసలకు నెడిసి తొలఁగుటే
తుద నరకములకుఁ దొలఁగుట
వదలక ఇంద్రియవర్గము గెలుచుటే
పదపడి తనపాపముల గెలుచుట


చ. 2:

మగటిమి సంసారమాయ దాఁటుటే
తగుభవవారిధి దాఁటుట
జగములోపలను శాంతిగలుగుటే
అగణిత మోక్షమునందుఁ బొందుట


చ. 3:

మహి ఇంతా హరిమయముగఁ గనుటే
విహితపు జ్ఞానము వెసఁ గనుట
ఇహమున శ్రీవేంకటేశు శరణనుటే
సహజపు జన్మము సఫలం బనుట