పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0314-06 దేసాళం సం: 04-083 వైరాగ్య చింత


పల్లవి :

గుల్ల గుల్లే రాయి రాయే గురి యెంతవేసినాను
అల్లనాఁడే అడియాస లవియేల విడుతు


చ. 1:

మహిలోన రోగములు మాన మందు గద్దుగాక
సహజగుణము మాన్పఁజాలుమందు గలదా
బహుబంధములు నీవే పాపితే నేమోకాని
అహరహమును నేనే అవియేల విడుతు


చ. 2:

తనరూపమద్దములో తగఁ జూడవచ్చుఁగాక
మనసు దా నద్దములో మరి చూడవచ్చునా
దినచంచలము నీవే తీర్చితేనేమో కాని
అనుఁగు సంశయము నేనదియేల విడుతు


చ. 3:

నాలుకచే రుచులెల్ల నంజి చూడవచ్చుఁగాక
జాలిఁబడ్డ కన్నులచేఁ జవి గానవచ్చుఁగాక
యేలి శ్రీవేంకటేశ నీవిట్టే కాతువుగాక
వేళ జీవుఁడను నా విధమేల విడుతు