పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0312-04 బౌళి సం: 04-070 వైరాగ్య చింత


పల్లవి :

తెలియుట యెన్నఁడు దేహి తనంతట
తెలియఁగ హరి నీదిక్కే కలది


చ. 1:

రాపుగ రేపేమూత్రపురీషంబులు
ఆపై నాఁకటి యలమటలు
కైపుగ నింతటఁ గామవికారము
మాపు నిద్దురలమంపులె కలది


చ. 2:

కొన్నాళ్లు బాల్యము కొన్నాళ్లు కౌమార
మన్నిటఁ గొన్నాళ్లు యౌవ్వనము
పన్నిన ముదిమియుఁ బైపైఁ గొన్నాళ్లు
వున్నతి నంతట నుడుగుట కలది


చ. 3:

జంతువులకు యీసరవులు నీవే
పొంతలఁ గల్పించి పొదిపితివి
యింతట శ్రీవేంకటేశ్వర నీకృప
చింతించి కావవే చేకొని నన్ను