పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0301-06 లలిత సం: 04-006 కృస్ణ

పల్లవి:
     ఆతఁ డితఁడా వెన్న లంతట దొంగలినాఁడు
     యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు

చ. 1:
    యీతఁడా దేవకిగన్నయింద్రనీలమాణికము
    పూతకిచన్ను దాగి పొదలినాఁడు
    యీతఁడా వసుదేవుని యింటిలో నిధానము
    చేతనే కంసునిఁ బుట్టచెండు సేసినాఁడు


చ. 2:
    మేటియైన గొంతిదేవి మేనల్లుఁ డీతఁడా
    కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
    పాటించి పెంచే యశోదపాలి భాగ్య విూఁతఁడా
    వాటమై గొల్లెతలను వలపించినాఁడు

చ. 3:
    ముగురువేలుపులకు మూలభూతి యీతఁడా
    జిగి నావులఁ బేయలఁ జేరి కాచెను
    మిగుల శ్రీవేంకటాద్రిమీఁది దైవమితఁడా
    తగి రామకృష్ణావతార మందె నిప్పుడు