పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0312-02 లలిత సం: 04-068 శరణాగతి


పల్లవి :

ఏతపములు నేల యేదానములు నేల
శ్రీతరుణీపతినిత్యసేవే జన్మఫలము


చ. 1:

దేహపుటింద్రియముల దేహమందే యణఁచుటే
దేహముతోనే తాను దేవుఁడౌట
సోహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటే
ఆహా దేవతలఁ దనందే తాఁ గనుట


చ. 2:

వెలి నిట్టూరుపుగాలి వెళ్ళకుండా నాఁగుటే
కులికి తపోధనము గూడపెట్టుట
తలఁపు తనందే తగ లయము సేయుట
లలిఁ బాపబంధముల లయము సేయుట


చ. 3:

వెనక సంసారమందు విషయ విముక్తుఁడౌటే
మునుపనే తా జీవన్ముక్తుఁడౌట
పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే
అనువైన దివ్యపదమప్పుడే తా నందుట