Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0311-04 ముఖారి సం: 04-064 వైరాగ్య చింత


పల్లవి :⁠

ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల
కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే

⁠


చ. 1:⁠

వలెననే దొకమాఁట వలదనే దొకమాఁట
సిలుగులీ రెంటికిని చిత్తమే గురి
వలెనంటే బంధము వలదంటే మోక్షము
తెలిసే విజ్ఞానులకు తెరువది యొకటే

⁠


చ. 2:⁠

పుట్టెడిదొకటే పోయెడిదొకటే
తిట్టమై యీ రెంటికిని దేహమే గురి
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
వొట్టిన విజ్ఞానులకు నుపమిది యొకటే

⁠


చ. 3:⁠

పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే
సిరులు నీ రెంటికిని జీవుఁడే గురి
యిరవై శ్రీవేంకటేశుఁ డిహపరములకర్త
శరణాగతులకెల్ల సతమితఁ డొకఁడే

⁠