పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0390-03 రామక్రియ సం: 04-522 నృసింహ

పల్లవి:

గరుడాద్రి వేదాద్రి కలిమి యీపె
సిరులొసఁగీఁ జూడరో చింతామణి యీపె

చ. 1:

పాల జలధిఁ బుట్టిన పద్మాలయ యీపె
లాలిత శ్రీ నరసింహులక్ష్మి యీపె
మేలిమి లోకమాతయై మించిన మగువ యీపె
యీ లీల లోకములేలే యిందిర యీపె

చ. 2:

ఘన సంపద లొసఁగు కమలాకాంత యీపె
మనసిజుఁ గనిన రమాసతి యీపె
అనిశమఁ బాయని మహా హరి ప్రియ యీపె
ధన ధాన్య రూపపు శ్రీ తరుణి యీపె

చ. 3:

రచ్చల వెలసినట్టి రమా వనిత యీపె
మచ్చిక గలయలమేల్ఁ‌మంగ యీపె
యిచ్చట వేంకటాద్రి నీ యహోబలమునందు
నిచ్చలూఁ దావు కొనిన నిధాన మీపె