పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంత్యప్రాస రేకు: 0308-05 శ్రీరాగం సం: 04-047

పల్లవి:
ఎందుఁ గాఁపురము సేతు నేది నిజ మేది గల్ల
ముందర నొక్కదినమే మూఁడు గాలములు

చ.1:
తనుభోగముల నివే తగ నొక లోకము
మనసులో తలపోఁత మరి యొక్క లోకము
యెనసిన కలలోని దిది యొక్క లోకము
మునుపు వెనకలివే మూఁడు లోకములు

చ.2:
పంచభూతముల చేతిబంధ మొక్క దేహము
యెంచఁగ నూరుపుగాలి యిది యొక్క దేహము
కొంచక త్రిగుణములగురి సూక్ష్మ దేహము
ముంచె నిదె వొకటీలో మూఁడు దేహములు

చ.3:
జీవునిలోపలివాఁడు శ్రీవేంకటేశుఁడు
తావై వెలినున్నవాఁడు తా నొక్కఁడే
శ్రీవేంకటాద్రిమీదఁ జెలఁగినాతఁ డీతడే
మూవంకల మముఁ గాచే మొక్కితి మాతనికి