పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0380-01 బౌళి సం: 04-464 మాయ

పల్లవి:

ఎందును బోరాదీ సంసారము
కందువ నీ మాయ గడవఁగ వశమా

చ. 1:

కలిమే చిత్త వికార హేతు ఎది
అలర లేమి దైన్య హేతువు
పలు లంపటములు బంధ హేతువులు
తలఁగిన నడవదు తనుపోషణము

చ. 2:

మదవికార మిదె మహిత యౌవనము
తుద వార్ధకమే దురంతము
యిదె యర్దార్జన యాతాయాతన
అదియు మానితే నాఁకలి ఘనము

చ. 3:

యెన్ని గడియించే వెన్నిట ముంచే -
విన్నిట శ్రీ వేంకటేశ్వరుఁడ
అన్నిట నంతర్యామివి నీవే
కన్ను దనియ ననుఁ గావఁగదే