పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0378-03 వరాళి సం: 04-455 అంత్యప్రాస

పల్లవి:

ఎరిఁగీ నెరఁగదు యేమి సేతు మతి
హరిదాస్యం బదియే సుఖము

చ. 1:

వెతలఁబొరలే ఘన విభవముకంటే
అతి పేదరిక మది సుఖము
గతి నెరవుల సింగారము కంటెను
సత మగు తన నిచ్చలమే సుఖము

చ. 2:

పలుబాములఁబడు పగలిటికంటే
తెలిసి నిద్రించు రాతిరి సుఖము
అలమట గడించు నమృతముకంటే
కలపాటి తనకు గంజే సుఖము

చ. 3:

పరపీడలొసఁగు భవమునకంటే
ధరఁ బొడమని చందము సుఖము
గరిమల శ్రీ వేంకటపతి నీకే
శరణని యెడి నాజన్మమే సుఖము