పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-01 లలిత సం: 04-447 శరణాగతి

పల్లవి:

నిఖిలమింతయు మేలు నేనే తీలు
మఖరక్షకుఁడ నన్ను మన్నించవే

చ. 1:

నిండును జలనిధులైనా నెఱి నేటిమొత్తములచే
నిండదు నామనసైతే నిచ్చా యాసల
పండును లోకములోని బహువృక్షతతులైనాఁ
బండదు నామనసైతే బహువిషయముల

చ. 2:

తనియుఁ బసురమైన ధరణిఁ గసవు మేసి
తనియదు నామనసు ధనకాంక్షల
వొనరఁ గారుచిచ్చైనా నొకవేళ శాంతిఁబొందు
పొనిగి యే పొద్దు శాంతిఁబొందదు నామనసు

చ. 3:

లోకములోఁ గఠినపు లోహమైనాఁ గరఁగును
కై కొని నామతి గరఁగదు భ్రమసి
యీకడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను
నీకే శరణంటి నెమ్మదిఁ గావఁగదే