పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0374-01 సామంతం సం: 04-432 గురు వందన, నృసింహ

పల్లకి:

వెనకముందరికిఁ బెద్దలకెల్లను వివరపుసమ్మతి యీ వెరవు
వెనుకొని తనగురునాథుని యనుమతి వేదొక్తంబగు నీ తెరువు

చ. 1:

కనకాసక్తుఁడు గాకుండుట మది కైవల్యమునకు నొకతెరువు
వనితల భ్రమలను వలలఁ దగులని మది వైకుంఠమునకు నొకతెరువు
మునుకొపముఁ బెడఁబాసిన మతి మోక్షంబునకును నొకతెరువు
యెనసి యిందుప హరిఁదలఁచినమతి యిన్నిటికెక్కుడు యీ తెరువు

చ. 2:

నిరతి విషయముల నణఁచిన దృఢమతి నిశ్శ్రేయమున కొకతెరువు
విరతితోడ నెలవై నమతి విభవపుఁ బరమున కొకతెరువు
వెరపున నిందరిమీఁదటిసమమతి విష్ణులోకమున కొకతెరువు
యిరవెరిఁ గంతట హరి నమ్మినమతి యిన్నిటి కెక్కుడు యీ తెరువు

చ. 3:

పన్నినకోరిక తెగఁగోసినమతి పరమపదమునకు నొకతెరువు
వున్న విచారములుడిగించినమతి వున్నతపదమున కొకతెరువు
సన్నుతి భగవద్దాసుల దాస్యమె చలమతి ముక్తికి నొకెతెరువు
యిన్నిట శ్రీవేంకటపతిశరణమె హితమతి నెక్కుడు యీ తెరువు