పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0372-05 రామక్రియ సం: 04-426 అంత్యప్రాస

పల్లవి:

ఎంతలేదు చిత్తమా యీఁతలేల మోఁతలేల
వంతులకుఁ బారనేల వగరించనేలా

చ. 1:

దక్కనివి గోరనేల తట్టుముట్టు పడనేల
చిక్కినంతకే సంతసించరాదా
ఒక్కమాఁటే వుప్పుదిని వుపతాప మందనేల
చక్కజాడఁ దగినంతే చవిగొనరాదా

చ. 2:

పారి పారి వేఁడనేల బడలిక పడనేల
మీరి దైవమిచ్ఛినంతే మెచ్చరాదా
వీరిడై పొడవెక్కి విరుగఁబడఁగనేల
చేరి యందినంతకే చేచాఁచరాదా

చ. 3:

జీవులఁ గొలువవేల సిలుగులఁ బడనేల
శ్రీవేంకటేశుఁ డాత్మఁ జక్కివుండఁగా
దావతి పడఁగనేల దప్పులం బొరలనేల
కైవశమైనందుకే గతిగూడరాదా