పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0372-02 సామంతం సం: ౦4-423 శరణాగతి

పల్లవి:

ఇన్నివిధాలు యిఁకనేల ప్ర -
పన్నుఁడై మీఁద బహువిధులేలా

చ. 1:

సతతభూతదయ సత్యవాక్యము గలితే
కుతిలపు ధర్మాలగొడవలేలా
ప్రతిలేనివిజ్ఞానభావశుద్ధి గలిగితే
మతకపుఁ గర్మాలు మరియేలా

చ. 2:

పొందుగ నిన్నిటను సమబుద్ధి నిలిచితేను
సందడిలోఁ దీర్థాచరణలేలా
నిందమాని యాసమాని నిర్మలచిత్తులయితే
వందడైన వుపవాస వ్రతము లేలా

చ. 3:

శ్రీ వేంకటపతి చింతనము గలిగితే
పావనపు శాస్త్రాల పఠనలేలా
ఆవల నీతని దాసులందుఁ బ్రేమ గలిగితే
కావరపుటితర సంగతులేలా