పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0371-06 దేవగాంధారి సం: 04-421 అంత్యప్రాస

పల్లవి:

హరి నీకేనే రుణ మత్తుఁగాక తగవైతే
వొరిమ నొకరియ్యఁగ నొకరికి దిద్దుటా

చ. 1:

మొలచు జననలోకమునకు నుదుట వ్రాసే
బలుఁడ నీచే నేఁ బత్రసాల మందుకొంటి
పెలుచు దేవతలకు పితరులకు రుణము
యిల నత్తునట యివి యేనాటి రుణము

చ. 2:

యేయెడ నేమిసేసి యేలోకమందున్నా
పాయని నీవే నాకు ప్రాణబంధుఁడవైతి
కాయపుఁ జుట్టరికాలు ఘన కరుణానుబంధ
మీయెడఁ గలిగెనట యేనాటి రుణము

చ. 3:

శ్రీవేంకటేశ నీవీ చిక్కులఁబెట్టి నాకు
కావిరిఁ గర్మాలు మెడఁ గట్టితివిగా
సోవల నీ శరణము చొచ్చిన నాకు నివి
యేవూరి కేవూరు యేనాఁటి రుణము