పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0371-03 లలిత సం: 04-418 శరణాగతి

పల్లవి:

హరి నీమయమే అంతాను
అరసి నీకు శరణనియెద నేను

చ. 1:

యెదుట నెవ్వరిఁక నేమాటాడిన
అది నీ ఘన నామాంకితమే
అదివో సకల శబ్దాఖ్యుఁడవని నిన్ను
పొదలి చదువులు పొగడీఁగాన

చ. 2:

యెవ్వరిఁ బొడగని యెక్కడనుండిన
నివ్వటిల్ల నది నీ రూపే
నెవ్వదీర నిదె నిను విశ్వరూపుఁ
డెవ్వల నని శ్రుతులెంచీఁ గాన

చ. 3:

భావన యిది నీ బ్రహ్మాత్మకమే
శ్రీ వేంకటేశ నాచింత యిదే
ఆవల నిను సర్వాంతర్యామెని
దేవ శాస్త్రములు తెలిపీఁ గాన