పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0368-03 గుండక్రియ సం: 04-401 శరణాగతి

పల్లవి:

హరి నీకే శరణని గెలుచుటగాక
యిరవుగ నెరఁగఁగ నెవ్వరి తరము

చ. 1:

తను వికారములు తరవులు వెట్టిన
కొనయెరుకైనా కొరతవడు
మనసు వికారము మమతలఁ దగిలిన
యెనసి యెదురుపడ నెవ్వరి తరము

చ. 2:

కంతు వికారము కన్నులఁగప్పిన
పంతపు విరతియు బయలౌను
చింతాలహరులు చీఁదర రేఁగిన
యింతయు వీడ్కొన వెవ్వరితరము

చ. 3:

అతిగుణవికార మాసలఁ బెట్టిన
సతతయోగములు జడనుపడు
మతి శ్రీ వేంకటపతి నిన్నుఁ గొలిచిన
యితరము దగ్గర నెవ్వరితరము