పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0364-03 దేవగాంధారి. సం: 04-377 వైరాగ్య చింత

పల్లవి:

ఏదైన దేవుఁడు ప్రాణికియ్యక లేదు
పాదుగ నాతనిమీఁది భక్తే సాధనము

చ. 1:

దేహమునకు ఫలము తెగని యాలుబిడ్డలు
దేహాంతరాత్మకును దేవుఁడొకఁడే ఫలము
దేహమే బంధకము దేవుఁడింతే మోక్షము
వూహల రెంటికి మనసొక్కటే సాధనము

చ. 2:

పుట్టినందుకు ఫలము పొందగు భోగములే
పుట్టుగే గెలుచుటకు భువి జ్ఞానమే ఫలము
పుట్టుటకు గర్మము పోవుటే యకర్మము
వెట్టే యీ రెంటికిని విరతే సాధనము

చ. 3:

చింతించుటకు ఫలము సిరులెల్లఁ జేకొనుటె
చింత వీడుటకు ఫలము శ్రీ వేంకటేశు సేవే
చింతలే దుఃఖములు నిశ్చింతములే సుఖములు
కొంత దాఁచనేల శ్రీ గురుఁడే సాధనము