పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0360-06 కన్నడగౌళ సం: 04-356 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

పరమాత్మఁడవు నీవు పరంజ్యోతివి నీవే
యిరవుగఁ గంటి వింటి నిదివో నీరూపము

చ. 1:

పెక్కురోమకూపముల పెనుబ్రహ్మాండాలు మోచే
వెక్కసపు నీకుఁ ద్రివిక్రమాకృతి యేమి
అక్కడ వేదశ్రుతి 'యత్యతిష్ఠద శాంగుల'
మెక్కువయని పొగడీ నిదివో నీరూపము

చ. 2:

వెడక జీవులలోనే వేవేలు రూపుల నీకు
యెదిటి దశావతారాలేమి యరుదు
అదె 'విశ్వతోముఖ యనంతమూర్తి'వని
యిదె శ్రుతి వొగడీని యిదివో నీరూపము

చ. 3:

దిందుపడి సురలు నీతిరుమేనఁ బొడమఁగ
యిందరు నీవేయవుట యేమి యరుదు
యెందును శ్రీ వేంకటేశ 'యేకో నారాయణ'
యిందులో శ్రుతి చాటీ నిదివో నీరూపము