పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0359-04 బౌళి సం: 04-348 మాయ

పల్లవి:

ఏమిసేయుదు నింతయు నీ మాయ
సామజవరద నా చందమిది

చ. 1:

జలము లోపలనున్నచందురు నీడవలె
నలుగడలఁ గదలీ నా మనసు
పెలుచు మేఘములు గప్పిన సూర్యునివలె
వెలుఁగదు నాలోని విజ్ఞానము

చ. 2:

కడఁగి యాకసమున గాలి యణఁగినట్లు
వడిఁగానరాదు నా వైరాగ్యము
ముడిగి ముత్తెపుఁ జిప్పముత్యము విధంబున
జడిసీ నాలోని సాత్వికము

చ. 3:

యిప్పుడిట్టె శ్రీ వేంకటేశ నీ కృపవలె
వుష్పతిల్లె నిజభక్తి యొక్కటై నీపై
కప్పిన నీ సేవవలెఁ గన్న నిధానమువలె
అప్పసమై నిలిచె బ్రహ్మానందము