పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0358-06 బౌళి సం: 04-344 వైరాగ్య చింత

పల్లవి:

ఎంత వెఱ్ఱిఁ గొండదవ్వి యెలుకఁ బట్టెద నేను
పంతపు శ్రీహరి నాభ్రమ వాపవే

చ. 1:

పడనిపాట్లఁ బెక్కుపనులఁ దిరుగుటెల్ల
కుడిచేపట్టెఁడు గూటికొర కింతే కా
కడదాఁకాఁ జెలులతోఁ గాఁపురము సేయుటెల్ల
వొడలు మరచియుండే వొక్క నిమిషానికా

చ. 2:

ఘనమైన గృహములు గట్టుకొనుటెల్లాను
తనువు మోచేయంతటికే కా
తనివోని మతిలోని తలపోఁత లెల్లాను
యెనసిన బదుకు తా నెంచుటకే కా

చ. 3:

యింతలోని పనియని యెరఁగని చేతఁలెల్లా
సంతకూటముల యీసంసారానకా
చెంతలశ్రీవేంకటేశ చేరి నీకే శరణంటే
యింతక మున్నిటినేర మేమనేవో కా