పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0353-06 సామంతం సం: 04-314 నామ సంకీర్తన

పల్లవి:

ఇన్నిటా నింతటా నిరవొకటే
వెన్నునినామమే వేదంబాయ

చ. 1:

నలినదళాక్షునినామకీర్తనము
కలిగి లోకమునఁ గలదొకటే
యిల నిదియే భజియింపఁగఁ బుణ్యులు
చెలఁగి తలఁప సంజీవని యాయ

చ. 2:

కోరిక నచ్యుత గోవిందాయని
ధీరులు దలఁపఁగఁ దెరువొకటే
ఘోరదురితహర గోవర్ధనధర
నారాయణ యని నమ్మఁగఁగలిగె

చ. 3:

తిరువేంకటగిరి దేవుని నామము
ధరఁదలపగ నాధారమిదే
గరుడధ్వజుని సుఖప్రదనామము
నరులకెల్లఁ బ్రాణము దానాయ