పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0346-02 కేదారగౌళ సం: 04-269 అద్వైతము


పల్లవి :

మీ మతము పరిభాష మీవల్లనే పుట్టెఁగాక
యేమునులైనాఁ దొల్లి యెంచిరా యీమాఁట


చ. 1:

ముడిగి నాలుగు సూత్రములె మీ వివరణము
కడమ వ్యాససూత్రాలు కల్లలా యేమి
కడు ముఖ్యము మహావాక్యమే చాలుననెను
అడరి వసిష్ఠాదు లాడిరా యీమాఁట


చ. 2:

తానె బ్రహ్మమనంటే తగ జీవన్ముక్తేనేరు
పూని లోకులెల్లా ముక్తిఁ బొందవలెఁగా
పాని కర్మానుభవాలు బాధితాను వృత్తనేరు
వీనుల సర్వపురాణాలు వింటీమా యీమాఁట


చ. 3:

పైకొని బ్రహ్మజ్ఞానము భక్తిరూపము గాదని
చేకొని కొచ్చెదరట్టె శ్రీవేంకటేశు
దీకొనుచుఁ జేసేరు దేవపూజాది యజ్ఞాలు
యేకాత్మవాదులాల యితవా యీమాట-