పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0345-03 లలిత సం: 04-264 వైరాగ్య చింత


పల్లవి :

ఏదాయ నేమి హరి యిచ్చినజన్మమే చాలు
ఆదినారాయణుఁడీ యఖిలరక్షకుడు


చ. 1:

శునకముబతుకును సుఖమయ్యే తోఁచుఁగాని
తన కది హీనమని తలఁచుకోదు
మనసొడఁబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో నంతరాత్మ దైవమౌట దప్పదు


చ. 2:

పురువుకుండేనెలవు భవనేశ్వరమై తోఁచు
పెరచోటి గుంతయైన ప్రియమైయుండు
యిరవై వుండితేఁజాలు యెగువేమి దిగువేమి
వరుస లోకములు "సర్వం విష్ణుమయ"ము


చ. 3:

అచ్చమైన జ్ఞానికి నంతా వైకుంఠమే
చెచ్చెరఁ దనతిమ్మటే జీవన్ముక్తి
కచ్చుపట్టి శ్రీ వేంకటపతిదాసుఁడైతే
హెచ్చుకుందేమిలేదు యేలినవాఁడితఁడే