పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0345-01 మేఘరంజి సం: 04-262 దశావతారములు


పల్లవి :

అని బ్రహ్మాదులెంచేరు హరిబాలలీలలు
వెనక శుకాదులచే వింటిమి నేమిదివో


చ. 1:

పొత్తులలోఁ బవ్వళించె పురుషోత్తముఁడు దొల్లి
హత్తి మఱ్ఱాకుపైఁ బండినటువలెనె
వొత్తగిలి బోరగిలి వుండఁజొచ్చెఁ గృష్ణుఁడు
తత్తరానఁ గూర్మావతారమైన గతిని


చ. 2:

తప్పుటడుగులు వెట్టె తగఁ ద్రివిక్రముఁడై
గొప్పపాదాలను భూమి గొలచినట్టు
అప్పుడే కొదలు మాఁటలాడఁ జొచ్చెఁ గృష్ణుఁడు
తప్ప నసుర సతులఁ దగఁ బోధించినట్లు


చ. 3:

అచ్చపు రేపల్లెలోన నాడఁజొచ్చెఁ గృష్ణుఁడు
మెచ్చుల వైకుంఠాన మెరసినట్లు
నిచ్చలు శ్రీవేంకటాద్రినిలయుఁడై యున్నవాఁడు
అచ్చుగ జీవులలోన నాతుమైనయట్లు