పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0344-01 దేసాళం సం: 04-256 నామ సంకీర్తన


పల్లవి :

ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ-
పదము లివి రెండు సంపదలు సౌఖ్యములు


చ. 1:

గోపికానాథ గోవర్ధనధరా
శ్రీపుండరీకాక్ష జితమన్మథా
పాపహర సర్వేశ పరమపురుషాచ్యుతా
నీపాదములే మాకు నిధినిధానములు


చ. 2:

పురుషోత్తమా హరీ భువనపరిపాలకా
కరిరాజవరద శ్రీకాంతాధిప
మురహరా సురవరా ముచుకుందరక్షకా
ధరణి నీపాదములె తల్లియును దండ్రి


చ. 3:

దేవకీనందనా దేవేంద్రవందితా
కైవల్యనిలయ సంకర్షణాఖ్య
శ్రీవేంకటేశ్వరా జీవాంతరాత్మకా
కావ నీపాదములె గతి యిహముఁ బరము