పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0342-04 శుద్ధవంతం సం: 04-247 వైరాగ్య చింత


పల్లవి :

దైవమా నీచేఁతలు తప్పదు మా రోఁతలు
యేవలఁ జూచిన బాయ దేమందమయ్యా


చ. 1:

కాయములో హేయమదె కమ్మఁబూఁత మీఁద నదె
రోయదు చిత్తమునకు రుచియే తోఁచీ
మాయలనే పొరలేది మాఁటలనే విసిగేది.
యేయెడఁ గనీ గాన మేమందమయ్యా


చ. 2:

పుట్టుగది యెంగిలి పూఁచిన దాచారము
గుట్టు చెడదందునాను గుణమే తోఁచీ
వట్టియాసఁ బొరలేది వంతఁ బడి తిరిగేది
యెట్టు వేగించఁగవచ్చు నేమందమయ్యా


చ. 3:

నిక్కిచూచితే నెరుక నిద్దిరించితే మరపు
మక్కళించినబదుకు మంచిదై తోఁచీ
మిక్కిలి శ్రీవేంకటేశ మీకు నేను శరణంటే
యెక్కువాయ నాపదవి యేమందమయ్యా