పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0342-01 సాళంగం సం: 0342-01 సాళంగం సం: 04-244 శరణాగతి


పల్లవి :

హరివల్ల కడమలే దంతనంత నున్నవాఁడు
గరిమఁ గాననివారికల్ల యింతే సుండీ


చ. 1:

లోనఁ హరిఁ దలచితే లోపలందె పొడచూపు
పూని వెలిఁ దలచితే భూమినల్లాఁ బొడచూపు
తానే యిందరిలోన దైవమయి వున్నవాఁడు
కానకవుండినవారికల్ల యింతే సుండీ


చ. 2:

పట్టి విచారించుకొంటేఁ బ్రాణముతోఁ బొడచూపు
జట్టిఁదనదండనల్లా సంసారమై చూపు
పట్టపగలై వున్నాఁడు బాయట నెందు చూచిన
గట్టిగా గాననివారికల్ల యింతే సుండీ


చ. 3:

శరణముచొచ్చితేనె చేతిలోనే వున్నవాఁడు
పరమభాగవతులపలుకులో నున్నవాఁడు
యిరవుగ శ్రీవేంకటేశుఁడెదుటనే వున్నాఁ డతని -
కరుణ గాననివారికల్ల యింతే సుండీ