పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0340-06 శంకరాభరణం సం: 04-237 కృష్ణ


పల్లవి :

ఏఁటి బిడ్డఁ గంటివమ్మ యెశోదమ్మ
గాఁటపు దేవతలెల్లఁ గాచుకున్నా రితని


చ. 1:

చెక్కుమీఁటి పాలువోయి చేరి నోరు దెరచితే
పక్కుననుఁ బొడచూపె బ్రహ్మాండాలు
అక్కున నలముకొంటే సంగజతాపము మోఁచె
మక్కువకు వెరతుము మాయపు బాలునికి


చ. 2:

పొత్తులలో నుండఁగానె భుజాలు నాలుగుదోఁచె
యిత్తల బాలునికేవి యిటువంటివి
యెత్తుకొన్న వేకమై యెవ్వరికి వసగాఁడు
హత్తిచూడ వెరతు మీ యారడిబాలునికి


చ. 3:

తేఱి వీనితోడిముద్దు దేవలోకము పనులు
మీఱి యేవి చూచినాను మితిలేనివి
ఆఱడిగొల్లెతలము అట్టె కూడి యాడితిమి
వేఱు సేయ వెరతు శ్రీవేంకటాద్రిబాలుని