పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0340-03 పాడి సం: 04-234 కృష్ణ


పల్లవి :

అనుచుఁ బొగడఁ జొచ్చెరదె బ్రహ్మాదులు మింట
మొనసి యీ బాలునికే మొక్కేము నేము


చ. 1:

వున్నతపు లోకములు వుదరాన నున్నవాఁడు
అన్నువ నీ దేవకీ గర్భమందు పుట్టెను
మన్నించి యోగీంద్రులమదిలోనుండెడువాఁడు
పన్నిన పొత్తులలోన బాలుఁడై వున్నాఁడు


చ. 2:

పాలజలధిలోన పాయనిగోవిందుఁడు
పాలు వెన్న లారగించె పైఁడికోరను
వోలిఁ దన విష్ణుమాయ నోలలాడినట్టివాఁడు
చాలి మంత్రసానులచే జలకమాడీని


చ. 3:

ముగురువేల్పులకు మూలమైన యట్టివాఁడు
తగుబలభద్రునికి తమ్ముఁడాయను
నిగిడి వైకుంఠమున నిలిచి రేపల్లెనుండి
యెగువ శ్రీవేంకటాద్రి నిరవాయ వీఁడే