పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0339-01 మాళవశ్రీ సం: 04-226 విష్ణు కీర్తనం


పల్లవి :

వేగిరించనేల విష్ణుఁడే యింతకుఁ గర్త
బాగుగా నాతనియిచ్చఁ బరగుటేకాక


చ. 1:

తలపోఁతలేల దైవము గలుగఁగాను
చెలఁగి యాతఁడే యిన్నీఁ జేసీఁగాక
యిల నేఁడె పుట్టెనా యింకాఁ గలది గాదా
పలులోకాలు నడప భారము దేవునిదే


చ. 2:

చింత లిఁకనేలా శ్రీపతి గలుగఁగాను
మంతుకుఁ బుట్టించి తానే మనుపుఁగాక
వింతా యీ దేహము వేరా యీ యింద్రియాలు
యింతట బ్రహ్మాండనాథుఁ డిందరికి నొకఁడే


చ. 3:

సిలుఁగు గోరికలేల శ్రీవేంకటేశ్వరుఁడు
కలఁ డాతఁడే మనలఁ గాచీఁగాక
వెలసి యాతనిమాయే విశ్వమింతా నిండినది
తెలిపి రక్షించుటకు దిక్కు దెస యితఁడే