పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0334-04 మలహరి సం: 04-199 హరిదాసులు


పల్లవి :

పరమోపకారులు ప్రత్యక్షదైవములు
హరిదాసు లిత్తురు బ్రహ్మానందసుఖము


చ. 1:

పాపుదురు లోకములో పాపపంకమెల్లాను
దీపించ శ్రీపాదతీర్థమున
వోపుదురు హీనుల వున్నతులఁగాఁ జేయ
చేపట్టి కన్నులెదుటిసేవామాత్రమున


చ. 2:

చెఱుతు రజ్ఞానమెల్లా జనులు తమ్ముఁజేరిన
మఱియుఁ దమప్రసాదమహిమవల్ల
తెఱచిత్తురు మోక్షము తెరువు ప్రాణులకెల్లా
మొఱఁగి మూలనుండి మొక్కినమాత్రమున


చ. 3:

చెల్లఁబెట్టుదు రెందైనా చిల్లరకులమువారి
తెల్లమిగా మంత్రోపదేశమున
యిల్లిదె శ్రీ వేంకటేశ యెక్కుడుసేసిరి మమ్ము
సల్లాపనల తమసహవాసములను