పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0332-02 సాళంగనాట సం: 04-185 గురు వందన


పల్లవి :

వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే
విష్ణుఁడ నీవెటైన వివరించుకోవయ్యా


చ. 1:

నెఱి నీబంటనా హరి నీకంటె బలువులైన-
తఱి నీదాసులకే నే దాసుఁడగాక
గుఱుతెరుఁగుదునా నేఁ గోరి యింతకతొల్లి
గుఱుతు చూపిన మాగురువునేకాక


చ. 1:

ముంచి నీకు మొక్కేఁగాక ముందే నీశరణులు
పెంచి పాదాలు నా నెత్తిఁబెట్టిరయ్య
పొంచి నీవేడ నేనేడ బుజముల ముద్రవెట్టి
సంచితమై సేసినట్టిసంబంధమేకాక


చ. 1:

శ్రీవేంకటేశ నీసేవే సేసేఁగాక నే డీ-
సేవకుఁ దెచ్చెను వారిసేవేకాదా
భావమొక్కటిగా నాకుఁ బట్టిచ్చిరి నిన్ను వారు
ఆవలీవలికిఁ బరమార్థమేకాక