పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0328-06 లలిత సం: 04-165 వేంకటగానం


పల్లవి :

మతంగపర్వతము మాల్యవంతము నడుమ
సతమై శ్రీవేంకటేశ్వరుడున్నవాఁడు


చ. 1:

కొలిచినవారికెల్లా కోరినవరములిచ్చి
తలచిఁనవారినెల్లా ధన్యులఁజేసి
పొలుపుమిగుల మంచిపువ్వుల తోఁటలనీడ
విలసిల్లినదివో శ్రీవేంకటేశ్వరుఁడు


చ. 2:

శరణన్నవారికి చనవిచ్చి రక్షించి
గరిమఁ బూజించువారిఁ గరుణఁ జూచి
పరిపూర్ణమగు తుంగభద్రాతటమునందు
విరివిగొన్నాఁడు శ్రీవేంకటేశ్వరుఁడు


చ. 3:

తను నమ్మినవారికి తగినసంపదలిచ్చి
కని నుతించేవారికిఁ గామధేనువై
కనకమయములైన ఘనమైనమేడలలో
వినుతికెక్కెను శ్రీవేంకటేశ్వరుఁడు