పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0328-04 ధన్నాసి సం: 04-163 నృసింహ


పల్లవి :

కొలువైతా నల్లవాఁడె కూచున్నాఁడు గద్దెమీఁద
బలవంతుఁ డితఁడు ప్రహ్లాదవరదుఁడు


చ. 1:

చిడుముడిగోళ్లతోడ సింహపుమోముతోడ
తొడమీఁదఁగూచున్న తొయ్యలితోడ
కడలేనినవ్వుతోడ కడురాజసముతోడ
అడరించీఁ బంతము ప్రహ్లాదవరదుఁడు


చ. 2:

సంకుఁజక్రములతోడ చాయలమేనితోడ
సంకెదేర్చేయభయహస్తముతోడ
బింకపుమీసాలతోడ పెనువదనముతోడ
అంకె వరములిచ్చీఁ బ్రహ్లాదవరదుఁడు


చ. 3:

వనితకౌఁగిటతోడ వామకరముతోడ
ననుపైన తమలోనానందముతోడ
యెనయుచు శ్రీవేంకటేశుఁడై యీడా నాడా
అనిశము వెలసెఁ బ్రహ్లాదవరదుఁడు