పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0319-04 మాళవి సం: 04-109 దశావతారములు


పల్లవి :

ఆతఁడోపో మాయేలిక ఆతఁడే జగన్మూల-
మాతఁడే శ్రీవేంకటాద్రి యందు మీఁది దైవము


చ. 1:

కమలవాసిని యైన కాంతఁ బెండ్లాడినాఁడు
కమలములో బిడ్డఁ గన్నవాఁడు
కమలాప్తునిలోనఁ గలిగి మెరయువాఁడు
కమలనాభుఁడేపో కలుగు మాదైవము


చ. 2:

జలధి బంధించి లంక సంహరించినవాఁడు
జలధిచొచ్చినదైత్యుఁజంపినవాఁడు
జలధిసుతునకు వరుస బావైనవాఁడు
జలధి శయనుఁడేపో చక్కని మాదైవము


చ. 3:

కొండ గొడుగుగనెత్తి గోవులఁగాచినవాఁడు
కొండవంటి రాకాసిఁ గొట్టినవాఁడు
కొండలకు నెక్కుడైన గురుతు శ్రీవేంకటాద్రి-
కొండరూపు దానేపో కోరిన మాదైవము