పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0318-01 గుండక్రియ సం: 04-102 శరణాగతి


పల్లవి :

ఏపను లెవ్వరికిఁగల దెంత యంతేకాని
శ్రీపతియాణాజ్ఞలు మీఁఱగ చింతింపఁగఁ దరమా


చ. 1:

సులభంబున సుఖియించుటఁబోలదు సొంపుగ భిక్షాన్నముతోడ
పలు లంపటములఁబడి ఘడియించేటి బహుధన మిగదియేల
తొలుతే జంతువులను వ్రాసెను తొడఁగి నుదిట బ్రహ్మ
కలది దైవికములఁ గడచెదమని కడుబడలేదరేలో నరులు


చ. 2:

పాపము సేయక మానుటఁ బోలదుపరమశాంతితోను
కోపము మానక బహుపుణ్యంబులు కోట్లు చేసినను
దీపింపఁగ వేదశాస్త్రములు తెలిపెడి యర్థ మిదే
కైపుగ నిది దెలియక జీవులు కడుబడలెదరేలో నరులు


చ. 3:

సహజము జగమున యీపనులెల్లను జరగుచు నుండుట స్వభావము
గహనము ప్రాణులకే పనులను ననఁ గాదన కర్తన్య మింతేది
యిహమేల శ్రీవేంకటేశ్వరు నమ్మిన యీతనిశ రణాగతులు
మహిలోఁజూతురు నవ్వుదు రిటువలె మానరేటికో నరులు