పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0080-3 ముఖారి సం: 05-291

పల్లవి:

ఎక్కడిదిఁకఁ బరిణామము యీమదనానలమునఁ బ్రియ-
మెక్కుడు దోఁపఁగ దైర్యంబింతయుఁ దీరెడిని

చ. 1:

మనసునఁదలఁచినతలఁపులు మాటల వెడలఁగ నాడిన
గొనకొని కన్నుల నీళ్ళు గుత్తుకవట్టెడిని
కనుఁగవ చూచినచూపులు కౌఁగిటఁ జేర్పఁగఁ బోయిన
పనివడి హృదయంబంతయుఁ బరవశమయ్యెడిని

చ. 2:

తనువున నాటినమాటలు తప్పక మతిఁ జింతించిన
అనువుగనది పరితాపంబై పెరరేఁ పెడిని
వెనకదినంబుల కూటమి వేడుకలని తలపోసిన
పెనగొన పూఁటకుఁ బూటకు ప్రేమము పెరిగెడిని

చ. 3:

తిరువేంకటగిరినాథుని దేవోత్తముఁ గూడిన మది
యెరగొని దేహవికారములెరవై తోఁపెడిని
పరమాత్మునికరుణారస పానము సేసిన జిహ్వకు
అరుదుగ నితరపదార్థములన్నియు రోసెడిని