పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0076-5 ముఖారి సం: 05-269

పల్లవి:

భావమెరఁగని పడుచా వోసి
పోవే పోవే పోవే పడుచా

చ. 1:

మొరఁగు మరఁగు వింత కరఁగుదేనెల-
పరచుమాటల పడుచా
చురుకు మెరుపు వాలుఁజూపుల కన్నుల
కెరలఁ బొడిచి గిలిగించేవే పడుచా

చ. 2:

కెలపు మలపుఁ బయిఁడి గిలుకుల మట్టెల-
బలుపుమోఁతల పడుచా
అలపు సొలపు ముద్దులొలుకు నవ్వుల
జలుకువలపు మీఁదఁ జుల్లేవే పడుచా

చ. 3:

వెదకి వెదకి తిరువేంకటేశ్వరుఁ
బదరి కూడిన పడుచా
కదలు గుబ్బల కలికిచేఁతల
వుదుటు నడపులనె వొరగేవే పడుచా