పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0076-2 శంకరాభరణం సం: 05-266

పల్లవి:

ఇంతి భువనమోహినియైన ఫలము
కాంతునిఁ దలఁచి వగలఁ జిక్కెనిపుడు

చ. 1:

మెలుఁతకన్నులు గండుమీలైన ఫలము
తొలఁకురెప్పల నీరు దొరకె నేఁడు
లలనమై నవపుష్పలతయైన ఫలము
వలపు చెమట నీట వడిఁ దోఁగె నిపుడు

చ. 2:

మెఱుఁగారు నెరులు తుమ్మిదలైన ఫలము
నెఱిఁ దమ్మిమోముపై నెలకొన్నవి
పఱచు జక్కవలు గుబ్బలైన ఫలము
తొఱలి తాపపురవితోఁ గూడె నిపుడు

చ. 3:

పలు వన్నెమోవి బింబమైన ఫలము
చిలుక వోట్లచేత జెలువొందెను
కలికి వేంకటపతి గలసిన ఫలము
సొలసినాడనె నిత్యసుఖమబ్బె నిపుడు