పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0066-6 సాళంగం సం: 05-210

పల్లవి:

నీవు దురగముమీఁద నేర్పు మెరయ
వేవేలు రూపములు వెదచల్లితపుడు

చ. 1:

పదిలముగ నిరువంక పసిఁడిపింజల యంప-
పొదుల తరకసములొరపులు నెరపఁగ
గదయు శంఖంబుఁ జక్రము ధను: ఖడ్గములు
పదివేలు సూర్యబింబములైనవపుడు

చ. 2:

సొరిది శేషుని పెద్దచుట్టు పెనుఁ గేవడము
సిరిదొలఁక నొకచేతఁ జిత్తగించి
దురమునకుఁ దొడవైన ధూమకేతువు చేత-
నిరవైన బల్లెమై యేచెనందపుడు

చ. 3:

కరకజడతో రమాకాంత జయలక్ష్మీయై
తొరలి కౌఁగిట నిన్నుఁ దొడికి పట్టి
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని
మెరుఁగు కుచకుంభముల మిసిమితో నపుడు