పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0027-5 శంకరాభరణం సం: 05-154

పల్లవి:

తలపట్టు వెట్టుకొన్న తరుణీమణి నిన్ను
నలసి వేమరుదూరు నాకెవో యీకె

చ. 1:

గొప్పలయిన గుబ్బలవేఁగుల నలయు సతులు
కొప్పులు జారఁగఁ దన్నుఁ గొలిచి రాఁగా
చెప్పరాని నటనల సింగారపుఁ దోఁటలోన
అప్పుడు నిన్నుఁ జూచిన ఆకెవో యీకె

చ. 2:

పాదపుఁబెండేలు మ్రోయఁ బడఁతులిరువంకల
సేదలు దేరుచుఁ దనచెంగట రాఁగా
మేదకపు తొలుకరి మెఱుఁగంటా నీ పప్పు-
డాదిగొని చూచిన ఆకెవో యీకె

చ. 3:

బంగారు చెరఁగుచీర పయ్యెదకొంగు దూలఁగా
అంగన వొకతె దనకాకు చుట్టీఁగా
ఇంగితమెఱిఁగి వేంకటేశుఁడ నిన్నుఁ గలసి
అంగడినెల్లఁ బెట్టిన ఆకెవో యీకె