పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0026-5 దేవగాంధారి సం: 05-148

పల్లవి:

ఇట్టిముద్దులాఁడిబాలుఁ డేడవాఁడు వానిఁ
బట్టితెచ్చి పొట్ట నిండఁ బాలు పోయరే

చ. 1:

గామిడై పారితెంచి కాఁగేటివెన్నలలోన
చేమపూవుకడియాలచేయి వెట్టి
చీమ గుట్టెనని తనచెక్కిటఁ గన్నీరు జార
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే

చ. 2:

ముచ్చువలె వచ్చి తనముంగై మురువులచేయి
తచ్చేటిపరుగులోనఁ దగఁ బెట్టి
నొచ్చెనని చేయి దీసి నోరనెల్లఁ జొల్లుగార
వొచ్చెలి వాపోవునాని సూరడించరే

చ. 3:

యెప్పుడు వచ్చెనో మాయిల్లు చొచ్చి పెట్టెలోన
చెప్పరానివుంగరాల చేయి వెట్టీ
అప్పడైనవేంకటేశుఁడాపాలకుఁడు గాన
తప్పకుండ పెట్టె వానితల కెత్తరే